ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో త్వరలో మరోసారి భూప్రకంపనలకు అవకాశం ఉందని ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త డా.శేఖర్ హెచ్చరించారు. అయితే బుధవారం ఉదయం వచ్చిన ప్రకపంపనలతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయన్నారు. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడం మేలని సూచించారు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందన్నారు. రిక్టర్ స్కేలుపై 6 లోపు ప్రమాదాలు జరగవని, మన దగ్గర ఈ ముప్పు లేదని శేఖర్ తెలిపారు. ప్రస్తుతం వచ్చిన భూకంపం తీవ్రత 5.3 గా ఉందని , ఇక రాబోయే రోజులు అంత తీవ్రత ఉందని చెప్పారు.. ఇక హైదరాబాద్ జోన్ 2 పరిధిలో ఉండటంతో భూ కంప ప్రభావం చాలా స్వల్పంగా మాత్రమే ఉంటుందన్నారుం
తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు..
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి జనం పరుగులు తీశారు. విజయవాడలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పట్టణం, పరిసర గ్రామాల్లో కంపించింది భూమి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లోని గంపలగూడెం విస్సన్నపేట మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో స్పల్ప భూప్రకంపనలు సంభవించాయి. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి 2 సెకన్లపాటు కంపించింది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ స్పల్ప భూప్రకంపనలు సంభవించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 సెకన్లపాటు స్వల్పంగా కంపించింది. కొత్తగూడెంతో పాటు మణుగూరు, భద్రాచలం మండలాల్లో స్పల్పంగా కంపించింది. చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7.26 గంటలకు భూమి స్పల్పంగా కనిపించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలు చెందారు. అలాగే, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ములుగు కేంద్రంగా ఉదయం 7.27 గంటలకు స్వల్ప భూకంపం సంభవించిందని అధికారులు గుర్తించారు. రిక్టర్స్ స్కేలుపై 5.3 భూకంప తీవ్రత నమోదైంది.