త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
ట్విట్టర్‌లో తెలిపిన రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ
(అమ్మన్యూస్‌ప్రతినిధి, హైదరాబాద్):
దర్శకధీరుడు రాజమౌళి ఫ్యామిలీ జపాన్‌లో భూకంపం నుంచి సురక్షితంగా బయటపడినట్లు రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఆర్‌ఆర్‌ఆర్ జపాన్‌లో కూడా విడుదలై విజయం సాధించింది. ఈ విజయాన్ని అక్కడి ప్రేక్షకులతో కలసి ఆస్వాదించడానికి రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఇటీవలే జపాన్ వెళ్లింది. అక్కడ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటోంది. అయితే గురువారం జపాన్‌లో భూకంపం వచ్చిందని.. అప్పుడు మేమంతా భయపడ్డామని తాజాగా కార్తికేయ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.
‘‘ఇప్పుడే జపాన్‌లో భయంకరమైన భూకంపం వచ్చింది. మేమంతా 28వ అంతస్తులో ఉన్నప్పుడు.. భూమి నెమ్మదిగా కదలడం గమనించాం. ఇది భూకంపం అని గ్రహించడానికి మాకు కొంత టైమ్ పట్టింది. మేమంతా ఒకవైపు భయపడుతుంటే.. జపాన్ వాళ్లు మాత్రం అసలు పట్టించుకోకుండా.. ఏదో వర్షం పడుతున్నట్లుగా వారి పని వారు చేసుకుంటున్నారు. భూకంపాన్ని ఫీల్ అయ్యే కోరిక తీరింది..’’ అని చెబుతూ ఆ బాక్స్‌లో ఎస్ టిక్ పెట్టారు. అంతేకాదు, భూకంపం రాబోతున్నట్లుగా ముందే వచ్చిన వార్నింగ్ మెసేజ్‌ని కూడా కార్తికేయ ఈ పోస్ట్‌లో చూపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.