ఆంధ్రప్రదేశ్లో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో శనివారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు నమోదయాయి. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలు చోట్ల భూమి కంపించింది. దీంతో జనాలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెప్పారు. ముండ్లమూరు ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లు, ప్రభుత్వ ఆఫీసుల నుంచి జనాలు బయటకు పరిగెత్తారు.
కాగా, ఇటీవల తెలుగు రాష్ట్రాలను భూకంపం భయపెట్టిన విషయం తెలిసిందే. ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేల్ పై 5 తీవ్రత కలిగిన భూకంపం భయపెట్టిన విషయం తెలిసిందే. గోదావరి పరిసర ప్రాంతాలతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి.