AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

ప్రస్తుతం హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను నేలమట్టం చేసే పనిని హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టగా.. దాని స్ఫూర్తితోనే రాష్ట్రవ్యాప్తంగా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే.. ఈ హైడ్రా కూల్చివేతలపై మొదట్లో మంచి రెస్పాన్సే రాగా.. ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి సమయంలో.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (సెప్టెంబర్ 29న) రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. తహసీల్దార్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు మంత్రి.

సామాన్యులకు మేలు జరిగేలా రాష్ట్ర రెవెన్యూ శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. ఎమ్మర్వోల బదిలీ మీద కూడా అతి త్వరలోనే సమీక్ష చేసి.. నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు.. తహసీల్దార్లపై కేసుల విషయంలో కలెక్టర్ల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్న మంత్రి.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడినట్టుగా గుర్తుచేశారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.

తహసీల్దార్లకు గ్రామీణ ప్రజలకు ఎలా సేవ చేయాలో తెలుసన్న మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మార్వోలలో 90 శాతం మంది రైతు కుటుంబాల నుంచే వచ్చారని గుర్తుచేసిన మంత్రి.. వారికి అన్నదాతల బాధ తెలుసని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేయాలని సూచించారు. తహసీల్దార్లకు ఉన్న అన్ని సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో ప్రభుత్వ భూమి ఒక్క ఇంచు కూడా ఆక్రమణకు గురికాకుండా చూసుకోవాలని ఎమ్మార్వోలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ ఉద్యోగులందరికి ట్రైనింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు, పేదలు, సామాన్యులకు వీలైనంత మేరకు చేయగలిగినంత సహాయం చేయాలని ఎమ్మార్వోలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తూ సర్కారుకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10