(అమ్మన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్):
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు గులాబీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఒకరి వెంట ఇంకొకరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. దానం మళ్లీ సొంతగూటికి చేరుకోనున్నాడా అన్న చర్చ మొదలైంది.
సీఎం రేవంత్ రెడ్డితో దానం నాగేందర్ భేటీ కావడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుక్రవారం రోజున.. హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వెళ్లి దానం నాగేందర్.. మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా.. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీప్ దాస్ మున్షీ ఉండటం.. మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలను దానం నాగేందర్ కలిశారు. ఇప్పుడు స్వయంగా ఆయనే వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక పార్టీ మార్పు ఖాయమన్న వార్తలు ఊపందుకున్నాయి.
అయితే.. దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైన విషయం తెలిసిందే. 1994, 1999, 2004 ఎన్నిలకల్లో.. ఆసీఫ్ నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకునిగా ఉన్న దానం.. 2004లో తెలుగుదేశం పార్టీలో చేరి.. ఆ పార్టీ తరపున బరిలో దిగి గెలిచారు. మళ్లీ ఆ తర్వాత ఆ సీటుకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో ఓడిపోయాపు. ఆ తరువాత నియోజకవర్గాల విభజన కాగా.. 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీచేసి గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఆరోగ్యశాఖ మంత్రిగా.. ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలోనూ అదే శాఖ మంత్రిగా కొనసాగారు.
ఇప్పటికే ఓసారి టీడీపీకి వెళ్లి సొంతగూటికి చేరుకున్న దానం.. ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి మరొక్కసారి సొంతగూటికి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం.