దర్యాప్తునకు సహకరించాలని హరీశ్‌కు సూచనలు
పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అరెస్టు మినహా తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని హరీశ్‌రావుకు సూచించింది. హరీశ్‌పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీసింది. విచారణను వాయిదావేసింది. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సిద్దిపేట కాంగ్రెస్ ఇన్‌చార్జి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో హరీశ్‌రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్ దాఖలు చేశారు.
పంజాగుట్ట పీఎస్‌లో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని అందులో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌పై ముందుకు వెళ్లకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. ఈనేపథ్యంలో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది.
ఇప్పటికే నాలుగు కేసులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీశ్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. రైతులకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టేసి మాట తప్పారని హరీశ్‌రావు ఆగస్టు 22న యాదగిరిగుట్ట ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రెండో కేసు ఈ ఏడాది అక్టోబర్ 4న సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. మంత్రి కొండా సురేఖకు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు నూలుపోగు దండ వేయడంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నిందితుడి సోషల్ మీడియాలో హరీశ్ ఫొటో కనిపించిందనే సాకుతో కేసు నమోదు చేశారని బీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు. మూడో కేసు ఈ ఏడాది అక్టోబర్ 25న బేగంబజార్‌లో నమోదైంది. హామీలను ఎగవేస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ‘ఎగవేతల రేవంత్‌రెడ్డి’ అని సంభోదించినందుకు హరీశ్‌పై కేసు నమోదు చేశారు. నాలుగో కేసు కరీంనగర్‌లో నవంబర్ 25న నమోదైంది. ఓ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డిని విమర్శించారన్న కారణంతో కేసు నమోదు చేశారు.