తెలంగాణ ప్రభుత్వం.. ప్రజలకు దసరా కానుక అందించింది. దసరా నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. అదే సమయంలో గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి.. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై దృష్టిసారించాలని పేర్కొన్నారు.
ఇక గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసినా వారికి ఇళ్లు కేటాయించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి వెంటనే ఇందిరమ్మ ఇళ్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే.. ఆ విషయంలో తెలంగాణ మాత్రం వెనుకబడి ఉందని గుర్తు చేశారు. అందుకే ఈసారి కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లు సాధించుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని సూచించారు.
ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారాన్ని వెంటనే అందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు సీఎంకు తెలపగా.. అవసరమైతే ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ బ్లాక్‌లు, ఇళ్లు వేలం వేయాలని సూచించారు. ఏళ్ల తరబడి వృథాగా ఉంచడం సరికాదని పేర్కొన్న సీఎం.. వెంటనే వేలానికి రంగం సిద్ధం చేయాలని చెప్పారు.
https://x.com/i/status/1838956362623250816