సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి
సింగిల్ విండో ద్వారా షూటింగ్‌లకు అనుమతి
దిల్‌రాజు స్పష్టీకరణ
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా సినీ నిర్మాత వి.వెంకటరమణ రెడ్డి అలియాస్ దిల్ రాజు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని టీఎఫ్‌డీసీ కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఆయన బుధవారం పదవీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజుకు సమాచార పౌర సంబంధాల ప్రత్యేక కమిషనర్ డాక్టర్ హరీశ్ పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమానికి పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరై దిల్ రాజును అభినందించారు.
సీని పరిశ్రమ అభివృద్ధికి కృషి
పదవీ భాద్యతలు చేపట్టిన అనంతరం, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన షూటింగ్స్ తెలంగాణలో మరింత ఎక్కువగా జరిగే విధంగా ప్రయత్నిస్తానని అన్నారు. ఎగ్జిబిటర్స్ సమస్యల పరిష్కారంతో పాటు, సినీ నిర్మాతలకు షూటింగ్ ల అనుమతులను సింగల్ విండో ద్వారా లభించేందుకు కృషి చేస్తానని అన్నారు.