AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ధరణి అంతా ఓ మాయ..  సభలో సీఎం రేవంత్ రెడ్డి సన్సేషనల్ కామెంట్లు

అర్హులైన ప్రతీ భూ యజమాని హక్కుల్ని చట్ట ప్రకారం కాపాడుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.  శుక్రవారం నాడు భూయాజమాన్య హక్కులపై నూతనంగా తీసుకువస్తున్న భూ భారతి చట్టంపై ప్రసగించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలోని ఏ రైతుకు అన్యాయం జరగకుండా చూస్తామని హామి ఇచ్చారు. ధరణీ పోర్టల్ ఓ తప్పుల తడక అని విమర్శించిన సీఎం.. అర్థరాత్రులు భూముల రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపించారు. ధరణి పేరు చెప్పి వేల ఎకరాల భూదాన్, ఆలయ భూములతో పాటు ప్రభుత్వ భూములను కొట్టేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ శాసన సభలో ప్రతిపక్ష నాయకులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడాన్ని తప్పుపట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. సభలో భూ భారతి చట్టంపై చర్చ జరగకుండా ఉండేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆగ్రహించారు. స్పీకర్ ను, అధికార పక్షాన్ని రెచ్చగొట్టి చర్చను పక్కదారి పట్టించాలని ప్రయత్నించారన్నారు. కానీ.. చివరికి వాళ్లే ఓపిక నశించి వెళ్లిపోయారన్నారు. చట్టంపై సభలో చర్చ జరగాలని కోరుకున్నామని కానీ.. ప్రతిపక్షం అహంభావం,అహంకారంతో చర్చకు అడ్డుతగిలిందని అన్నారు.

తెలంగాణ అంటేనే భూపోరాటాలు అన్న సీఎం రేవంత్ రెడ్డి.. రావి నారాయణ రెడ్డి, అరుట్ల కమలాదేవి, అరుట్ల రాంచంద్రా రెడ్డి, మల్లు స్వరాజ్యం, భీం రెడ్డి నర్సింహా రెడ్డి,చాకలి ఐలమ్మ లాంటి వారి పోరాటం భూమి కోసమేనని గుర్తు చేశారు. వాళ్లంతా భూమిని ఆత్మగౌరవం, హక్కుగా భావించారన్నారు. సాయుధ రైతాంగ పోరాటానికి అదే నేపథ్యమన్న సీఎం రేవంత్.. అధికారంతో, అహంకారంతో ఆధిపత్యాన్ని చేలాయించడాన్ని ఇక్కడి ప్రజలు సహించరని వ్యాఖ్యానించారు.

ధరణి అంతా ఓ మాయ.. 

తన మెదడు రంగరించి ధరణి అద్భుతాన్ని సృష్టించాను అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారని కానీ.. 2010లోనే ఒడిస్సాలో ఈ-ధరణి పేరుతో ఇలాంటి వ్యవస్థ ఉందని సీఎం సభకు తెలిపారు.  ఈ పోర్టల్ ను అనుభవం లేని సంస్థకు కట్టబెట్టడాన్ని తప్పుబడ్డిన రేవంత్ రెడ్డి.. క్రిమినల్ నేపథ్యం ఉన్న సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారన్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న వారిలో ఎవరూ ఈ దేశానికి చెందిన వ్యక్తులు కాదని.. అలాంటి వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ రైతుల భూములు. వ్యక్తిగత వివరాలు పెట్టారని ఆగ్రహించారు.  ఇది చాలా తీవ్రమైన నేరమన్నారు.

ప్రజలకు ద్రోహం చేసి, మోసం చేసి ఇక్కడి రైతుల సంపూర్ణ సమాచారాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించారంటే.. దీనిపై ఎలాంటి విచారణ చేయాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీ (MCHRD)లో అద్భుత సాంకేతిక ఉందన్న సీఎం.. ఇతర రాష్ట్రాలకు మన సాంకేతికత అందిస్తుంటే.. మనవాళ్లు వేరే దేశాల సంస్థలకు ఎందుకు అప్పగించారని అనుమానం వ్యక్తం చేశారు.

ఆనాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసినా .. లెక్కచేయకుండా తిమ్మాపూర్ భూదాన్ భూములను ప్రయివేట్ వ్యక్తుల పేరు పైకి మార్చారని సీఎం రేవంత్ రెడ్డి సభకు వెల్లడించారు. ఈ విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను అక్రమంగా బదిలీలు చేశారని ఆరోపించారు. ఎక్కడి నుంచైనా , ఏ పేరుకైనా భూమి హక్కుల్ని మార్చేలా సంబంధిత సంస్థకు అధికారం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ధరణి అద్భుతమైతే సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా.? ధరణి గురించి సంపూర్ణంగా వివరించచ్చు కదా.? ఎందుకు సభ నుంచి వెళ్లిపోయారని ప్రశ్నించారు.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10