సీఎం పదవికి షిండే రాజీనామా..
సీఎం పదవిపై వీడిన ఉత్కంఠ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ తొలగిపోయింది. సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మరోవైపు తన నివాసానికి, పార్టీ కార్యాలయానికి ఎవరూ రావద్దంటూ ఎక్స్ వేదికగా పార్టీ శ్రేణులకు షిండే సందేశం ఇచ్చారు. కాగా, తదుపరి ముఖ్యమంత్రి ఎన్నికయ్యే వరకూ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని షిండేను ఆ రాష్ట్ర గవర్నర్ కోరారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధినాయకత్వం దేవేంద్ర ఫడ్నవీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫడ్నవీస్‌నే సీఎం చేయాలంటూ ఆర్ఎస్ఎస్ పట్టుపట్టింది. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు మహాయుతిలో ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం చెబుతోంది. సీఎం అభ్యర్థి ఎవరంటూ ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్‌లు చర్చలు జరిపారు. కాగా, దీనిపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ సీఎం అయితే ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉంది.
షిండేకు ఉపముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖతోపాటు కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉంది. అలాగే శివసేన పార్టీకి 10 లేదా 12 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎంతోపాటు ఆర్థిక శాఖా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ వర్గానికీ దాదాపు 10 మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. బీజేపీ కోటాలో దాదాపు 20 నుంచి 22 మంత్రి పదవులు బీజేపీ వర్గానికి రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లాడ్లీ బెహన్ స్కీమ్ తీసుకొచ్చి రెండున్నరేళ్లు సీఎంగా షిండే మంచి పని చేశారని, అందుకే మొదట్లో ఆయనకు మరోసారి సీఎం పదవి దక్కాలని కోరినట్లు శివసేన నేతలు చెబుతున్నారు. శివసేన సీఎల్పీ నేతగా ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ సీఎల్పీ నేతగా అజిత్ పవార్ ఎన్నిక కానున్నారు.