హైడ్రా బాధితులకు నా జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్ధ్దమా అంటూ ప్రశ్న
(అమ్మన్యూస్, హైదరాబాద్):
కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు వెంకట రమణారెడ్డి రేవంత సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర చెరువుల్లో సుమారు 30 రియల్ ఎస్టేట్ కంపెనీలు చేపడుతున్న నిర్మాణాలను కూల్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. నా దగ్గర మొత్తం డేటా ఉందని, పక్క ఆధారాలు సైతం ఉన్నాయని అన్నారు. ఆధారాలు ఇస్తాను కూలుస్తారా..? అని సవాల్ చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లో అనేక చోట్ల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటికి ఈ రేవంత్ సర్కార్ ఈసీ సర్టిఫికెట్స్ కూడా జారీ చేసిందని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇదంతా చేస్తుందని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేవలం మధ్య తరగతి ప్రజలనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడారన్నారు. భట్టి విక్రమార్క హైడ్రాపై 190 పేజీల రిపోర్ట్ ఇచ్చారని , హైడ్రాపై భట్టి చేసిన ప్రజెంటేషన్ క్లారిటీ లేదన్నారు.
రూ. లక్షల కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జా..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షల కోట్ల విలువ చేసే అనేక స్థలాలు కబ్జాలకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. వీటిలో కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు విదేశీయులకు ఈ ప్రభుత్వం అనుమతులు సైతం ఇచ్చిందని ఆరోపించారు.
అవాస్తవమని నిరూపిస్తే సూసైడ్ చేసుకుంటా..
గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో వేలాది మంది ఇళ్ళు నిర్మించుకొనేందుకు వివిధ బ్యాంకులు లోన్లు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇవన్నీ అవాస్తవమని మీరు నిరూపిస్తే నేను సూసైడ్ చేసుకొని చనిపోతానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి.. రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు.
జీతాలను హైడ్రా బాధితులకు ఇద్దాం..
ఇక రాష్ట్రంలోని మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు, 19 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ జీతాలను నష్టపోయిన హైడ్రా బాధితులకు ఇద్దామని సీఎం రేవంత్ రెడ్డికి కామారెడ్డి ఎమ్మెల్యే సూచించారు. తన పది నెలల ఎమ్మెల్యే జీతం రూ. 20 లక్షలు ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అందుకు మిగతా వారంతా రెడీగా ఉన్నారా? సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు.
హైడ్రాతో పేదల్లో ఆందోళన..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా తో ప్రజలు సతమతమవుతున్నారని కాటిపల్లి అన్నారు. తమ ఇళ్లు ఎప్పుడు కూల్తాయోననే భయాందోళనలో ప్రజలు ఉన్నారని అన్నారు. ఒక్క ఎన్ కన్వెన్షన్ కూల్చేతే చెరువులన్నీ శుద్ధి అయ్యాయా..? అని ప్రశ్నించారు. 20 గుంటలు, 30 గుంటలు తప్ప, ఎకరాల్లో ఆక్రమణలకు గురయిన చెరువులు, కుంటలు లెక్కలు భట్టికి కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే అన్నారు. నగరంలో చాలా ఏరియాల్లో చెరువులు మాయం అయ్యాయినేది ఉప ముఖ్యమంత్రికి తెలియదా..? కబ్జాకు గురయ్యాయనేది ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారు కానీ ఎవరు కబ్జా చేశారు అనేది చెప్పడం లేదని అన్నారు.