కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను హడలెత్తించిన చేసిన ఏనుగు ఎట్టకేలకు ప్రాణహిత నది దాటింది. పెంచికల్పేట్ మండలం మురళీగూడ గ్రామ సమీపంలో ఏనుగును గుర్తించి అటవీశాఖ అధికారులు, ప్రత్యేక బృందాలు, పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి.. ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్ర అడవుల్లోకి సాగనంపారు. 36 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్ గజ ముగియడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. కానీ.. గుంపు నుండి తప్పిపోయి వలస వచ్చిన ఏనుగు తిరిగి మహారాష్ట్ర వెళ్లిపోవడంతో రిలాక్స్ అయిన అటవీశాఖను.. ఆ ఏనుగు మళ్లీ తిరిగి వచ్చే ప్రమాదం ఉందన్న నిపుణుల హెచ్చరిక ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఒంటరిగా వచ్చిన ఏనుగు తిరిగి గుంపులో కలిస్తే.. ఆహారం.. ఆవాసం కోసం మళ్లీ ఆ గుంపుతో ప్రాణహిత దాటే ప్రమాదం ఉందని చెప్పడంతో కొమురం భీం జిల్లా అటవీశాఖ అలర్ట్ అయింది. ఒకవేళ ఏనుగు మళ్ళీ వస్తే ఏం చేయాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఏనుగు ఆలోచన, ప్రవర్తన ఎలా తెలుసుకోవాలి.. అనే విషయాలపై ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగా.. చత్తీస్గఢ్ అటవీశాఖ ట్రాకింగ్ టీమ్, వైల్డ్ లైఫ్ నిపుణులతో కొమురం భీం జిల్లా అటవీశాఖ సిబ్బందికి ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేసింది. ఫారెస్ట్ వాచర్లు, బీట్ ఆఫీసర్లు , డిప్యూటీ రేంజర్లు, రేంజర్లు, ఎఫ్డీవోలకు కోల్కతాకు చెందిన సేజ్ సంస్థ ఛీప్ రితీష్చౌదరి అవగాహన కల్పించారు.
ఒకచోటకు వెళ్లిన ఏనుగుల గుంపు మరోసారి అదే ప్రాంతానికి తప్పకుండా వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో.. ఏనుగులకు ఎలాంటి ఆహారం, నీరు సమకూర్చకూడదని చెప్పారు. ప్రధానంగా.. ఏనుగు ఉన్న చోటకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీశాఖ సిబ్బందికి సూచించారు. ఇక.. చెవులు, దంతాలతో ఏనుగు వయసు, ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చన్నారు చత్తీస్గఢ్ ఎలిఫెంట్ ట్రాకింగ్ టీమ్ స్పెషలిస్ట్.