22 పైసలు పడిపోయి 84.31 వద్దకు పతనం
రూపాయి విలువ భారీగా పతనమైంది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 22 పైసలు క్షీణించింది. ఫలితంగా ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ మారకపు రేటు మునుపెన్నడూ లేనివిధంగా 84.31 స్థాయికి దిగజారింది. హోరాహోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంతో యూఎస్ డాలర్ ఇండెక్స్ పరుగులు పెట్టింది.
ఈ క్రమంలోనే రుపీ విలువ ఆల్‌టైమ్ లో స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అన్ని ప్రధాన దేశాల కరెన్సీల విలువ ఒక్కసారిగా పెరగడం, మరోవైపు దేశీయ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్టు ఫారెక్స్ ట్రేడర్లు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. త్వరలో జరుగబోయే ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్ల కోతలుంటాయన్న అంచనాలూ దెబ్బతీసినట్టు చెప్తున్నారు. 2025లో 100 బేసిస్ పాయింట్లదాకా వడ్డీరేట్ల తగ్గింపులుండొచ్చన్న అభిప్రాయాలున్నాయి.
ఒడిదొడుకుల్లో..
దాదాపుగా గత వారం రోజుల నుంచి ఊగిసలాటకు గురువుతున్న రూపాయి మారకం విలువ.. బుధవారం తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే 14 పైసల నష్టంతో 84.23 వద్ద మొదలవగా, చివరకు 22 పైసల నష్టంతో 84.31 స్థాయికి పడిపోయింది. మధ్యలో 84.15కు కోలుకున్నా నిలదొక్కుకోలేకపోయింది. సోమవారం ముగింపుతో చూస్తే మంగళవారం రుపీ 2 పైసలు బలపడి 84.09 వద్ద నిలిచింది. అయితే ఆ జోష్‌ను కొనసాగించలేకపోయింది. ట్రంప్ గెలుపుతో డాలర్ ఇండెక్స్ 1.34 శాతం ఎగిసి 104.80 వద్దకు చేరింది.
ఆర్బీఐ జోక్యం అవసరం
రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనమైన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం లాభించగలదన్న అభిప్రాయాలు ఫారెక్స్ మార్కెట్ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ చర్యలు రుపీ విలువను తిరిగి పెంచగలవని అంటున్నారు. కాగా, గ్లోబల్ మార్కెట్లలో పెట్టుబడులకు రిస్క్ పెరగడం, కమోడిటీ ధరల్లో క్షీణత కూడా రూపాయిని బలపర్చగలదని పేర్కొంటున్నారు.