తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం నాలుగో ఆదివారం కావడంతో ఉభయ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో యాదగిరి గుట్టతోపాటు పట్టణం కూడా భక్తజనంతో కిక్కిరిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈఓ భాస్కరరావు తెలిపారు.
సత్యనారాయణ వ్రతాల మండపం కిటకిట
సత్యనారాయణ స్వామి నిర్వహించే మండపం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం ఆనవాయితీ. తెల్లవారు జామున దీపారాధన అనంతరం వ్రతాలు కూడా అధిక మంది భక్తులు చేశారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.
దర్శనానికి బారులు
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి దర్శనానికి తెల్లవారు జాము నుంచి భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది. కొండపైన గర్భాలయంలో పాంచనారసింహులతో పాటు శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.