AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు.. నాగార్జున పరువు నష్టం కేసులో కీలక పరిణామం

హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సవాలు చేస్తూ నాగార్జున వేసిన పరువు నష్టం దావాను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి న్యాయస్థానం.. తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. డిసెంబర్ 12వ తేదీన జరగనున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని మంత్రి కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది.

అయితే.. అక్కినేని నాగార్జున కుటుంబపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సమంత, నాగచైత్య విడిపోయేందుకు కారణం కేటీఆరేనని తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ.. నాగచైతన్య, నాగర్జునపై దారుణమైన ఆరోపణలు చేయటం సర్వత్రా సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే.. హీరో నాగార్జున, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావాలు వేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన కుటుంబాన్ని ఎంతగానో బాధించాయని.. సినిమా ఇండస్ట్రీలో ఏళ్లుగా ఎంతో గౌరవంగా ఉంటున్న తమలాంటివారిపై ఇలాంటి ఆరోపణలు చేయటం వల్ల తమ పరువుకు తీవ్ర భంగం వాటిల్లిందని నాగార్జున పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో.. ఇప్పటికే నాంపల్లి కోర్టు ఎదుట హాజరైన అక్కినేని నాగార్జున నుంచి.. న్యాయస్థానం నేరుగా వాంగ్మూలం తీసుకుంది. నాగార్జున వాంగ్మూలంతో పాటు సాక్ష్యుల వాంగ్మూలం కూడా తీసుకుంది. కాగా.. నాగార్జున పిటిషన్ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. గురువారం (నవంబర్ 28న) మధ్యాహ్నం.. మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. కోర్టు ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా.. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసిన న్యాయవాది.. ఆ వ్యాఖ్యలను అన్ని మీడియా సంస్థలు ప్రచురితం చేసిన తర్వాత ట్విట్టర్‌లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారని తెలిపారు. మంత్రి పెట్టిన పోస్టును ధర్మాసనానికి చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం ఎంతో కుంగిపోయిందని.. కచ్చితంగా ఆమె క్రిమినల్ చర్యలకు అర్హురాలని అశోక్ రెడ్డి వాదించారు.

అంతకు ముందు.. కొండా సురేఖ తరఫు వాదించిన లాయర్ గురుప్రీత్ సింగ్.. తాను చేసిన వ్యాఖ్యలపట్ల మంత్రి క్షమాపణలు కూడా చెప్పారని కౌంటర్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. డిసెంబర్ 12న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరై.. ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మంత్రికి సమన్లు జారీ చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10