భార్య జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొని తిరిగి ప్రయాణమైన భార్యాభర్తలిద్దరిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. జన్మదిన వేడుకలు జరుపుకున్న 48 గంటలలోపే ఆ దంపతులను మృత్యువు వెంటాడింది. మరణంలోనూ భార్యాభర్తల బంధం వీడలేదు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామస్తులు సామినేని నవీన్ (29), భార్గవి (27) దంపతులు దుర్మరణం చెందారు.
సామినేని వెంకట రామారావు హైదరాబాదులోని హయత్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు నవీన్, కోడలు భార్గవి విజయవాడలో నివాసం ఉంటున్నారు. నవీన్ విజయవాడలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 20వ తేదీన నవీన్ తన భార్య భార్గవి జన్మదిన వేడుకలను తల్లిదండ్రుల సమక్షంలో జరుపుకునేందుకు హైదరాబాదుకు భార్య భార్గవితో కలిసి వెళ్ళాడు. 20వ తేదీన భార్గవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నవీన్, భార్గవి దంపతులు తిరిగి కారులో విజయవాడకు ప్రయాణమయ్యారు. విజయవాడకు వెళుతున్న క్రమంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢకొీని కారులో ప్రయాణిస్తున్న నవీన్, భార్గవి దంపతులు అక్కడికక్కడే మరణించారు. వీరి మరణంతో సోమవారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం సాయంత్రం నవీన్, భార్గవి మతదేహాలను సోమవరం గ్రామానికి తీసుకువచ్చారు.