భద్రాచలం: సీతమ్మను మనువాడిని భద్రాచల రామయ్య నేడు పటాభిషిక్తుడు కానున్నాడు. శ్రీరామ నవమి భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో రాములవారికి మహా పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారిని గవర్నర్ రాధాకృష్ణన్ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం బుధవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ‘శ్రీరామ.. జయరామ.. జయజయ రామ’ నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. కల్యాణ ఘడియ కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్న భక్తజనం రాముడిని పెండ్లి కుమారుడిగా, సీతమ్మ తల్లిని పెండ్లికుమార్తెగా దర్శనం చేసుకొని తరించారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది.