కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో.. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ల మద్దతుతో సోమవారం కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ వేశానని కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు అన్నారు.
తనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు గెలిపించాలని కోరారు. కరీంనగర్‌లో తాను 15,000 మందిని పేరుపెట్టి పిలుస్తానని, అంతగా ఇక్కడి ప్రజలు తెలుసని తెలిపారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే జగపతిరావును ఆదర్శంగా తీసుకుని పనిచేస్తానని చెప్పారు.
కేంద్రంలో నరేంద్ర మోదీకి పదేళ్లు పాటించే అవకాశం ఇస్తే అన్ని ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణలో ప్రకటించిన గ్యారంటీల అమలుతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు.
పొన్నం ప్రభాకర్ ఏమన్నారు?
కాంగ్రెస్ నుంచి సంకేతాలు ఉన్నాయి కాబట్టే తమ మద్దతుతో వెలిచాల నామినేషన్ వేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఈసీ నుంచి అభ్యర్థి ప్రకటన అధికారికంగా వస్తుందని చెప్పారు. బీజేపీలో సఖ్యత లేదని, కాంగ్రెస్ పార్టీలో అందరూ ఐక్యంగా ఉన్నారని తెలిపారు.