AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీలో గందరగోళం.. చెప్పులు, వాటర్‌ బాటిల్స్, పేపర్లు విసురుకున్న ఎమ్మెల్యేలు..!

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌
చెప్పులు, వాటర్‌ బాటిల్స్, పేపర్లు విసురుకున్న ఎమ్మెల్యేలు..!
కేటీఆర్‌ పై కేసు నేపథ్యంలో గందరగోళం
ఫార్ములా– ఈ రేస్‌పై చర్చించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పట్టు

తెలంగాణలో శాసనసభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఫార్ములా– ఈ రేస్‌పై చర్చించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా.. స్పీకర్‌ తిరస్కరించారు. దీంతో సభ్యులు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పేపర్లు, వాటర్‌ బాటిళ్లు విసురుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. ఆరో రోజు సమావేశాల్లో భాగంగా శుక్రవారం సభలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధంతో సభ దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి భూ భారతి బిల్లుపై మాట్లాడుతుండగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్‌పై పెట్టిన హైదరాబాద్‌ ఫార్ములా ఈ–కారు రేసు అంశంపై చర్చ పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఫ్లకార్డులు పట్టుకొని సభ్యులు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సభ 15 నిమిషాలు వాయిదా..
ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ సభ్యులు పేపర్లు విసురుకున్నారు. చెప్పులు చూపించుకోవటంతో పాటుగా.. వాటర్‌ బాటిళ్లు సైతం విసురుకున్నారు. సభలో గందరగోళ పరిస్థితి తలెత్తటంతో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దళిత స్పీకర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు.

స్పీకర్‌ను అవమానిస్తారా?..
దళితుడైనా స్పీకర్‌ మీద పేపర్లు విసిరి అగౌరవపరిచారంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సభా నియామాలు ఉల్లంఘించిన బీఆర్‌ఎస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, ఆనాటి ప్రభుత్వ పెద్దలు ధరణిని అడ్డుపెట్టుకొని పేదల భూములు లాక్కొన్నారని.. భూముల వ్యవహారం బయటపడుతుందనే సభను అడ్డుకున్నారని ఆరోపించారు. స్పీకర్‌ ఛైర్‌ను బీఆర్‌ఎస్‌ సభ్యులు అవమానపరిచారని.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలన్నారు. స్పీకర్‌ పోడియం వైపు బీఆర్‌ఎస్‌ సభ్యులు దూసుకెళ్లే సమయంలో వారిని మార్షల్స్‌ అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి దళిత స్పీకర్‌ను అవమానించేలా సభలో వ్యవహరించారని .. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేసారు.

ఒక వ్యక్తి కేసుపై రాద్ధాంతమా?
వాయిదా విరామం తర్వాత సభ ప్రారంభం కాగా.. ఒక వ్యక్తి కేసు గురించి ఇంత ఇష్యూ చేయటం సరికాదని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అన్నారు. సభను తప్పుదోవ పట్టించడం మంచిది కాదన్నారు. భూ భారతి ముఖ్యమైన బిల్లు అని.. ప్రజలకు సంబంధించిన బిల్లులపై చర్చల వేళ ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. భూ భారతి బిల్లు ఆమోదం పొందాక బీఆర్‌ఎస్‌ సభ్యులను తన ఛాంబర్‌కు పిలుస్తానన్నారు. అయినా బీఆర్‌ఎస్‌ సభ్యులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే మంత్రి పొంగులేటి భూభారతిపై వివరించారు.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10