హైదరాబాద్ బేగంపేటలో కలకలం రేగింది. బేగంపేట జైన్ కాలనీలో దుండగులు గన్ తో ఓ ఇంట్లోకి చొరబడ్డారు. పిస్తోలుతో బెదిరించి దోచుకోవడానికి ప్రయత్నించారు. అయితే, ఇంట్లో ఉన్న తల్లీ కూతురు ఎంతో ధైర్యంగా వారిపై తిరగబడ్డారు. ఊహించని విధంగా తల్లీ బిడ్డ ఎదురు తిరగడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఓ వ్యక్తి బ్యాగులో తుపాకీ పెట్టుకుని వచ్చాడు. దుండగుడు ఇంట్లోకి చొరబడటం, తుపాకీతో ఇంట్లో వారిని బెదిరించడం, తల్లీ కూతురు దుండగుడిపైకి తిరగబడటం.. ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి. ఏడాది క్రితం ఇంటి పని కోసం (ఇంటిని పరిశ్రుభం చేసేందుకు) ఆగంతకులు వచ్చారు. అదే ఇంట్లో కొంతకాలం పని చేశారు. ఇంటి గుట్టు మొత్తం తెలుసుకున్నాక.. సంవత్సరం తర్వాత ప్రణాళిక అమలు చేశారు. దోపిడీకి యత్నించిన వారిలో ఒకరు పోలీసుల అదుపులో ఉండగా మరొకరు పరారీలో ఉన్నారు. ఆ వ్యక్తి నుంచి పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. బైక్ పై దోపిడీకి వచ్చారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు ఇంట్లోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించి దోపిడీకి యత్నించాడని పోలీసులు తెలిపారు. తల్లీకూతుళ్ల ప్రతిఘటనతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న మరో దుండగుడి కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది.