పార్లమెంట్ ముఖ్య నేతలతో సీఎం భేటీ
(అమ్మన్యూస్, హైదరాబాద్):
సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడిరది. అభ్యర్థ మార్పు విషయంలో పార్టీ అధిష్టానం మరోసారి క్లారిటీ ఇచ్చింది. అయితే, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ అధిష్టానం సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. కానీ, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే ఎంపీగా పోటీ చేయాలంటూ పార్టీ మెలిక పెట్టింది. అందుకు దానం ఒప్పుకోకపోవడంతో అభ్యర్థి మార్పు పక్కా అనే సమాచారం బయటకు పొక్కింది. దీంతో దానం నాగేందర్ స్థానంలో మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు.
ఈ భేటీకి ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి మార్పు ఉండదని వారికి సీఎం రేవంత్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తనకే ఎంపీ టికెట్ వస్తుందని చూసిన బొంతు రామ్మోహన్‌కు నిరాశే ఎదురైంది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆయనకు కాకుండా దానం నాగేందర్‌కు కేటాయించింది. ఈ నేపథ్యంలో బొంతు రామ్మోహన్ కొన్ని రోజులుగా కాంగ్రెస్ పెద్దలకు దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? లేక మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే చేరుతారా అనేది ఆసక్తిగా మారింది.