AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు భారీ షాక్.. కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఫైన్‌

‘చెన్నమనేని’ జర్మనీ పౌరుడే..

రూ.30లక్షల జరిమానా విధింపు
నెల రోజుల్లో చెల్లించాలంటూ ఆదేశాలు

పౌరసత్వంపై వేములవాడ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు ఫేక్‌ డాక్యుమెంట్స్‌ సమర్పించారని మండిపడింది. చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు రమేశ్‌కు రూ.30లక్షల జరిమానా విధించింది హైకోర్టు. పిటీషనర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ కు రూ.25 లక్షలు చెల్లించాలని, మిగిలిన రూ.5లక్షలు లీగల్‌ సర్వీ సెస్‌ అథారిటీకి చెల్లించాలని, నెల రోజుల్లో చెల్లింపులు చేయాలని ఆదేశించింది.

రమేశ్‌ పిటిషన్‌ డిస్మిస్‌..
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం తీర్పు నేపథ్యంలో మరికొన్ని అంశాలను న్యాయమూర్తి. ప్రస్తావించారు. ఇన్ని రోజులు చెన్నమనేని రమేశ్‌ ఏ పాస్‌ పోర్ట్‌ మీద ట్రావెల్‌ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జర్మనీ పాస్‌ పోర్ట్‌ మీద ట్రావెల్‌ చేశారని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రమేశ్‌ పిటిషన్‌ డిస్మిస్‌ చేసింది.

సుదీర్ఘ విచారణ..
పదిన్నర ఏళ్లపాటు హైకోర్టులో చెన్నమనేని రమేష్‌ కేసు సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సమయంలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు ఫేక్‌ డాక్యుమెంట్లు సమర్పించారని కోర్టు మండిపడింది. చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో రూ.5 లక్షలు హైకోర్టు లీగల్‌ సర్వీస్‌ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు ఆదేశించింది. నెలరోజుల పాటు ఆర్డర్‌ను సస్పెన్షన్‌లో ఉంచాలని చెన్నమనేని రమేశ్‌ న్యాయవాది కోరారు.

2009లో రాజకీయాల్లోకి..
రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయాల్లో చెన్నమనేని కుటుంబాలు లేకుండా చూడలేం. వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం నాగారం నుంచి మొదలైన చెన్నమనేనిల రాజకీయ ప్రస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగింది. రాజేశ్వర్‌రావు వారసుడిగా 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన చెన్నమేని రమేశ్‌బాబు వరుసగా ఎన్నిక ల్లో గెలుస్తూ వస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలోనూ చురుకుగా  ఉన్నారు. 2009లో సార్వత్రిక ఎన్నికల్లో వేములవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా రమేశ్‌బాబు పోటీ చేయగా ప్రత్యర్థిగా అది శ్రీనివాస్‌ నిలిచారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన శ్రీనివాస్‌.. రమేశ్‌బాబు ఎన్నిక చెల్లదని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందారని హైకోర్టును ఆశ్రయించారు.

జరిగింది ఇదీ..

2010 జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రమేష్‌బాబు పోటీ చేసిన సందర్భంలోనూ అది శ్రీనివాస్‌ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. అప్పుడు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను నిలిపివేసింది. హైకోర్టును బీఆర్‌ఎస్‌ పార్టీ ఆశ్రయించగా అరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నికలు జరపాలని చెప్పింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉప ఎన్నికల్లో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి రమేశ్‌బాబు పౌరసత్వంపై అది శ్రీనివాస్‌ పోరాటం చేస్తూనే వచ్చారు. 2013లో రమేశ్‌బాబు పౌరసత్వాన్ని శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. రమేశ్‌బాబు సుప్రీం కోర్టును అశ్రయించి స్టే పొందారు. 2014 ఎన్నికల్లో మరోసారి రమేశ్‌బాబు గెలుపొందారు. కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టు ఆదేశాలతో 2017లో రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది. హోంశాఖ హైకోర్టును సంప్రదించవచ్చని పేర్కొనడంతో మళ్లీ హైకోర్టుకు చేరుకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10