వైఎస్సార్సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముసలోడు అని, ఆయనకు పాలన చేత కాదని, సీఎంగా పవనే బెటర్ అని అన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ప్రభుత్వం తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించే క్రమంలో పవన్ కల్యాణ్ ప్రస్తావన తెచ్చిన సాయిరెడ్డి.. చంద్రబాబు, లోకేష్ కంటే పవనే బెటర్ లీడర్ అని వ్యాఖ్యానించారు. దీనిపై చర్చ కొనసాగుతుండగానే శుక్రవారం ఎక్స్ లో మరో సంచలన పోస్టు పెట్టారు. పవన్ కల్యాణ్ ను సీఎం పదవికి తగిన వ్యక్తిగా అభివర్ణిస్తూ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ పెట్టారు. ఇందులో సాయిరెడ్డి.. పవన్ కు జాతీయ స్ధాయిలో ప్రజాదరణ, వయస్సు ఉన్నాయని తెలిపారు. కాబట్టి తాను ఏపీకి నాయకత్వం వహించడానికి, ప్రాతినిధ్యం వహించడానికి పవన్ కళ్యాణ్ తగిన వ్యక్తి అని అనుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.
కూటమిలో ఆదర్శవంతమైన వ్యక్తి..
అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ కూటమి నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కల్యాణ్ అని సాయిరెడ్డి తెలిపారు. ఏపీ వంటి ఓ యువ రాష్ట్రానికి దాదాపు 75 ఏళ్ల వయస్సు కలిగిన వృద్థుడు చంద్రబాబు నాయకత్వం వహించలేరని సాయిరెడ్డి తేల్చేశారు. తద్వారా రాష్ట్రానికి పవన్ కల్యాణ్ వంటి యువ నాయకత్వం అవసరమని సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.సాయిరెడ్డి వ్యాఖ్యలపై కూటమి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.