కడప: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నారు.. వందకు కోటిసార్లు ఆయన ఓడిపోతున్నారంటూ.. వైఎస్సార్సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి ఆట ఇంతటితో ముగుస్తోందన్న రాచమల్లు.. చంద్రబాబు శకం మరో 18 రోజుల్లో ముగుస్తుందన్నారు. జూన్ నాలుగో తేదీన చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తం కానుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కా సమాచారం ప్రకారం.. వైఎస్సార్సీపీ సర్వేలతోపాటు తాను సేకరించిన సమాచారం ప్రకారం.. కుప్పంలో చంద్రబాబు నాయుడు పక్కాగా ఓడిపోతున్నాడని రాచమల్లు వ్యాఖ్యానించారు.
లోకేశ్, బాలయ్య ఓటమి కూడా ఖాయం..
ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా.. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ సైతం ఓడిపోతున్నారన్న రాచమల్లు.. మంగళగిరిలో లోకేశ్ ఓటమి సైతం ఖాయమైందన్నారు. ఈ ముగ్గురు నేతలు ఇప్పటికే ఓడిపోయారన్న వైసీపీ నేత.. జూన్ 4న ఈసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అన్నారు. ఇది తాను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా మాత్రమే చెప్పడం లేదన్న రాచమల్లు.. తమ అధిష్టానం దగ్గరున్న పక్కా సమాచారం ఉందన్నారు. చంద్రబాబు నాయుడిపై భరత్ 20 వేల ఓట్ల తేడాతో గెలవబోతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు.
బాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు..
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చంద్రబాబు నాయుడు అధికారులతో మైండ్ గేమ్ ఆడుతున్నారన్న రాచమల్లు.. టీడీపీ అధినేత దింపుడు కల్లం ఆశలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న సర్వేలన్నీ జగన్ మరోసారి అధికారంలోకి వస్తున్నారని స్పష్టం చేస్తున్నాయన్నారు. మహిళలు, వృద్ధులు, గ్రామీణ ఓటర్లు, యువ ఓటర్లు జగన్ సంక్షేమ పాలనకు పట్టం కట్టబోతున్నారని అన్ని మీడియా ఛానెళ్లు చెబుతున్నాయన్నారు. ఇది జనం ఇచ్చిన తీర్పు.. జగమెరిగిన సత్యమని రాచమల్లు వ్యాఖ్యానించారు.