తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు. మీరు భుజాల మీద మోయబట్టే మేమంతా ఇవాళ వివిధ హోదాల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే ఆడబిడ్డల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై ఉంది. 2014 నుంచి 2019 వరకూ బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రిగా లేరని ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ మహిళలు ఇచ్చిన తీర్పుతో మెుదటి మంత్రివర్గంలోనే కొండా సురేఖ, సీతక్కకు మంత్రులుగా అవకాశం కల్పించామని సీఎం చెప్పుకొచ్చారు.
ఈ ఓరుగల్లు ఆడబిడ్డలకే మంత్రివర్గంలో ప్రముఖస్థానం ఇచ్చి నేటి సభా నిర్వహణ కార్యక్రమాన్ని సైతం వారి చేతుల్లోనే పెట్టామని రేవంత్ తెలిపారు. ఇదే కాకుండా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కడియం కావ్యను పార్లమెంట్‌కు పంపించామని ఆయన చెప్పారు. ఆమె తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతోందని అన్నారు. పాలకుర్తిలో ఓ రాక్షసుడు రాజ్యమేలుతుంటే యశస్విని రెడ్డి అనే సోదరి ఆ రాక్షసుడిని ఎన్నికల్లో ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా ఆడబిడ్డనే అని ఆయన తెలిపారు. అనేక మంది మహిళా అధికారులు పలు జిల్లాలకు కలెక్టర్లుగా ఉన్నారని వెల్లడించారు. వరంగల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా ఓ మహిళలే ఉందని సీఎం చెప్పుకొచ్చారు. వారి రుణం ఇంకా తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి చెప్పారు.
కేసీఆర్‌కు సవాల్..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ” తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తే జైల్లో పెడతాం. తెలంగాణలో కేసీఆర్ తాగుబోతుల సంఘాన్ని తయారు చేశారు. ఫుల్, ఆఫ్‌కు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. ప్రజలను మత్తుకు బానిసలుగా చేసి అధికారం చెలాయించారు. బీఆర్ఎస్ అధికారం దిగిపోతే కేసీఆర్, కుటుంబ సభ్యుల ఉద్యోగాల ఊడాయి తప్ప.. రాష్ట్రానికి ఏం కాలేదు. కేసీఆర్.. హాయిగా మీరు ఫామ్ హౌస్‌లో పడుకోండి. అవసరమైతే అక్కడే వైన్ షాప్ ఏర్పాటు చేయిస్తా. మీ ఉద్యోగాలు పోయాయి కాబట్టి రైతులకు రుణమాఫీ జరుగుతోంది. ఇంకా కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. కచ్చితంగా చేసి తీరుతాం. అభివృద్ధిపై చర్చకు బిర్లా-రంగాలు సిద్ధమా..? రైతు రుణమాఫీ చేస్తే అభినందించాల్సిందిపోయి విమర్శిస్తున్నారు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అనలేదా?. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. నువ్వు ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ పెట్టిస్తా. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. ఆయన రాకుండా ఇద్దరు చిల్లరగాళ్లను పంపుతున్నారు. ఆఖరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసం పనిచేస్తా. తెలంగాణలో కేసీఆర్ మొక్కను మళ్లీ మొలవనివ్వను. దమ్ముంటే అసెంబ్లీకి రా.. చర్చిద్దాం.
కిషన్ రెడ్డికి కౌంటర్..
తెలంగాణ ద్రోహి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అలాంటి మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాంగిరీ చేస్తారంట. ఆయనకు తెలంగాణలో ఉండే అర్హత లేదు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందుకే ఆమె కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా తప్పులేదు. కాళోజీ కళాక్షేత్రం పదేళ్లైనా మీరెందుకు పూర్తిచేయలేదు. తెలంగాణ భావాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. అందుకే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేశాం. మీరు అభివృద్ధి చేసేవాళ్ల కాళ్లలో కట్టె పెట్టొద్దు. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. వరంగల్‌ను హైదరాబాద్‌కు పోటీ నగరంగా తీర్చుదిద్దుతున్నాం. అందుకే వరంగల్‌కు రూ.5,500 కోట్ల నిధులు మంజూరు చేశాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఖమ్మం కంటే వరంగల్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. వరంగల్ అభివృద్ధి చేస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే. అందుకే నగరం అభివృద్ధి జరిగే వరకూ నిద్రపోను. వరంగల్, కొత్తగూడెం, రామగుండెంకు ఎయిర్‌పోర్ట్‌లు రావాల్సి ఉంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నాం” అని చెప్పారు.