AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌ చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే డ్రామాలు.. బీఅర్‌ఎస్‌ నేతల తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు పిచ్చిపట్టిందని, అందువల్లే ఏదేదో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి వారికి మతి భ్రమించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే తట్టుకోలేక బీఆర్‌ఎస్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపిందని మండిపడ్డారు. మామ, తండ్రి పేరు చెప్పుకుని హరీశ్‌రావు, కేటీఆర్‌ లాగా తాము వారసత్వంగా ఎమ్మెల్యేలం కాలేదని కౌంటర్‌ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ఏళ్లు గడిచినా.. ఇంకా చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. గడిచిన పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌కు ఎన్నడైనా కేసీఆర్‌ నివాళులర్పించారా అని ప్రశ్నించారు.

రౌడీలను పురమాయించి దాడులా?
రేప్, మర్డర్‌ కేసులు ఉన్న వ్యక్తులను పురమాయించి లగచర్లలో కలెక్టర్, అధికారులపై కేటీఆర్‌ దాడులు చేయించి భూసేకరణను అడ్డుకున్నారని ఆరోపించారు. ఏదో విధంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతూ.. అటంకం సృష్టించడమే బీఆర్‌ఎస్‌ నాయకులు పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు. ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్ట్, స్కిల్‌ యూనివర్సిటీ, రూ.500 లకే ఉచిత సిలిండర్, గృహలక్ష్మి పథకం కింది ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకాలను అమలు చేయడం వారికి మింగుడు పడటం లేదని.. అందుకే విపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. సెక్రటేరియట్‌ ఎదుట ప్రతిష్టించే తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ మహిళలా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10