తక్షణం నిలిపివేయాలంటూ ఆదేశాలు
లగచర్ల, దిలావర్ పూర్‌లో అమలు
రైతుల్లో హర్షాతిరేకాలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతలను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను నిలిపివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం లగచర్లలో ఫార్మా విలేజ్ నిర్మాణానికి రైతుల నుంచి భూములు సేకరించాలని ప్రయత్నించారు. అది కాస్తా ఆందోళనలుకు దారి తీసింది. అందులోని రాజకీయ కుట్రలపై ఇప్పటికే.. దర్యాప్తు చేస్తున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో నిర్మల్ లో ఇథనాల్ పరిశ్రమ కోసం ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించిన భూముల సేకరణ అంశంపై కూడా వివాదం చెలరేగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆ రెండు గ్రామాల్లోనూ..
లగచర్ల, దిలావర్ పూర్ లోని భూముల సేకరణను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రేవంత్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని.. తమ పాలనలో ఎవరినీ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని తెలిపింది. కొందరు రైతులు సానుకూలంగా ఉన్నా, మరికొందరికి కొన్ని అనుమానాలు ఉన్నా.. అన్నింటినీ నివృత్తి చేస్తామని ప్రకటించింది. కానీ.. ఈ వ్యవహారాల్లో రాజకీయ కుట్రలు సైతం సాగుతుండడంతో.. శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా.. ఈ అంశాలను అడ్డం పెట్టుకుని రైతుల్లో వ్యతిరేకతను రేకెత్తించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.