రైతు భరోసా విధివిధానాల రూపకల్పన కోసం నియమించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది. భట్టి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఈ భేటీలో రైతు భరోసా విధి విధానాలపై వారు చర్చించనున్నారు. ఇప్పటికే సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భట్టి ఆధ్వర్యంలోని సబ్ కమిటీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై సబ్ కమిటీ అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ రైతు భరోసాపై చర్చ పెట్టిన ప్రభుత్వం ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరించింది. రైతు భరోసాను రైతు బంధు మాదిరిగా భూరికార్డుల మేరకు కాకుండా సాగు భూమి లెక్కల ఆధారంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. గూగుల్ డేటా, శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించి పంట వేసిన మేరకే రైతులకు రైతు భరోసా సహాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.