హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) కు లోక్‌సభ ఎన్నికల ముందు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలంతా వరుసగా కాంగ్రెస్ (Congress) లో చేరుతున్న సమయంలో గులాబీ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే కోవలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) కూడా గులాబీ పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది.
శనివారం తక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వెంకట్రావుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది.
ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు వచ్చిన ఊహాగానాలను కొట్టేస్తూ వచ్చారు. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డిని తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా కలిసిన విషయం తెలిసిందే. అప్పుడే ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీ మారలేక పోయారని సమాచారం. ఈరోజు తుక్కుగూడ సభ వేదికగా వెంకట్రావు కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో10కి 10 స్థానాలు కాంగ్రెస్ వశం అయ్యాయి.
ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ వస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మొదటగా కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వెంకట్రావును మంత్రి పొంగులేటి పంపిస్తేనే బీఆర్ఎస్‌లో చేరినట్లు ప్రచారం జరిగింది. ఈరోజు కాంగ్రెస్‌లో వెంకట్రావు చేరడంతో పొంగులేటి తన అనుచరుడిని మళ్లీ తన దగ్గరకు తీసుకొచ్చుకున్నట్లు అయింది. వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.