బీఆర్ఎస్ సీనియర్ నేత, పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆదివారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. పదేళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో కలిసిపోయి పార్టీ కోసం పనిచేస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు మరికొంతమంది హాజరు కావాల్సి ఉండగా.. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారని వివరించారు. బండి సంజయ్, అర్వింద్, ఈటల రాజేందర్ తదితర నేతలను తాను ప్రత్యేకంగా వెళ్లి కలుస్తానని చెప్పారు. తన అనుచరులతో కలిసి జై భారత్, జై మోదీ అంటూ ఈ సందర్భంగా ఆరూరి రమేశ్ నినాదాలు చేశారు.