వారిచ్చింది రైతుబంధు కాదు.. పట్టా బంధు
మంత్రి సీతక్క ఫైర్
బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదని, పట్టా బంధు అని, రైతులకు బేడీలు వేసిన చరిత్ర కూడా బీఆర్ఎస్ పార్టీదే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. అసెంబ్లీలో రైతు బంధుపై చర్చలో భాగంగా కౌలు రైతులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. అద్దె ఇంట్లో ఉన్నోడు ఓనర్ అయితడా.. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి రైతు బంధు అని ఆరోజు మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు .. ఈ రోజు ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు.
అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది రైతు బంధు కాదని, పట్టా బంధు ఇచ్చారని, పట్టా ఉన్నవాళ్లకే రైతుబంధు వచ్చిందని, కౌలు రైతులకు, పట్టా లేని చిన్నా, సన్నాకారు రైతులకు రాలేదని చెప్పారు. అంతేగాక రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారని, అది రుణమాఫీ కాదని, కేవలం వడ్డీమాఫీ అని స్పష్టం చేశారు. ఆ రోజు రుణమాఫీ పేరుతో పెట్టిన నిబంధనల వల్ల ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీకి కొందరు అర్హులు కాలేదు అన్నది వాస్తవమని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు అన్నీ చేశామని చెబుతున్నారని, మరి 30 వేల కోట్ల రుణమాఫీ ఎందుకు మిగిలి ఉన్నదో కేటీఆర్ చెప్పాలన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ఫ్రీబస్ పెట్టిందని, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిందని, రూ. 500 లకే గ్యాస్ ఇచ్చిందని, భరోసా కింద 12 వేల రూపాయలు ఇవ్వబోతుందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో భూమి లేని నిరుపేదలకు ఏం ఇచ్చారో చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.