యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 11 నుంచి మార్చి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 11న స్వస్తివాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. 17న ఎదుర్కోలు, 18న స్వామి వారి తిరుకల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, 21న శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో ఉత్సవాలను పరిపూర్ణం చేయనున్నారు. ఇందులో భాగంగా వారం రోజులపాటు అలంకార సేవలు నిర్వహించనున్నారు.
ఆలయం పునఃప్రారంభమైన తరువాత రెండోసారి జరిగే వార్షిక బ్రహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ మండపంలో రంగురంగుల విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. రథశాలను సిద్ధం చేశారు. ఆలయ ప్రధాన రహదారుల్లో విద్యుద్దీపాలతో కూడిన స్వాగత తోరణాలు బిగించారు. ఈ సారి స్వామివారి కల్యాణోత్సవాన్ని కొండపైన ఉత్తరభాగం తిరుమాఢ వీధుల్లో జరిపించనున్నారు. స్వామివారి అలంకార సేవలను తిరుమాఢ వీధుల్లో ఊరేగించనున్నారు. ఈ ఉత్సవాల్లో 100 మంది పారాయణికులు, రుత్వికులు, ఆచార్యులు, పండితులు పాల్గొననున్నారు.