పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి . సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు.. తొలుత ఇటీవలేకాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత లోక్‌సభ (Lok Sabha) మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.
అటు రాజ్యసభ లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో ఎగువ సభను చైర్మన్ ధన్‌కర్ బుధవారానికి వాయిదా వేశారు. డిసెంబర్ 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. మణిపూర్ హింస, గౌతమ్ అదానీ అవినీతి చర్యలపై యూఎస్ అరెస్ట్ వారెంట్, ఢిల్లీలో వాయు కాలుష్యం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోదీ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.