సంగారెడ్డి జిల్లాలో ఘటన
(అమ్మన్యూస్, సంగారెడ్డి జిల్లా):
ఏకంగా చెరువులో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైంది. అధికార యంత్రాంగం ఆ నిర్మాణాన్ని డిటోనేటర్లతో జలసమాధి చేసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్షాయిపేట మల్కాపూర్ పెట్ట చెరువు ఎన్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను మండల రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. విషయం కలెక్టర్‌కు తెలిపారు. ఆమె ఆదేశాల మేరకు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య బహుళ అంతస్తుల భవనాన్ని తహసీల్దార్ అనిత, ఇతర అధికారులు నేలమట్టం చేయించారు. కాగా, భారీ నిర్మాణం కావడంతో కూలుతున్న సమయంలో వచ్చిన రాయి తగిలి అక్కడే ఉన్న హోంగార్డు గోపాల్ తలకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న అధికారులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రేవంత్ సర్కార్ ఉక్కుపాదం..
రాష్ట్రంలో చెరువులు, నాలాలను అక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పేరుతో ఉక్కు పాదం మోపుతోంది. అందులోభాగంగా హైదరాబాద్‌తోపాటు నగర శివారులోని పలు భవనాలను ఇప్పటికే హైడ్రా నేలమట్టం చేసింది. అలాంటి వేళ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కుతుబ్‌శాయి పేట గ్రామంలో అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు.