ఏడాదిలో ఏనాడైనా కేసీర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ప్రారంభోత్సవం, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత గంధంవారి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేదని.. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండ వ్యక్తే.. నల్గొండలో పుట్టినప్పుడల్లా సాయుధ పోరాటం గుర్తొస్తుందని సీఎం రేవంత్ అన్నారు. నల్గొండలో కృష్ణా జలాలు ప్రవహిస్తే.. ప్లోరైడ్ సమస్య తీరుతుందని ప్రజలు భావించారు కానీ.. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నల్గొండ వాసులకు తీవ్ర నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ జిల్లాలో కృష్ణా జలాలను ప్రవహింపజేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం అన్నారు. వరి పండిస్తే.. ఉరేసుకున్నట్టేనని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 8,500 ఐకేపీల ద్వారా రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. 2.70 లక్షల ఎకరాల్లో సన్న వడ్లను నల్గొండ జిల్లా రైతులు పండించారన్నారు. మూడు రోజుల్లో రైతులకు ధాన్యం అమ్మిన డబ్బులు చెల్లిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.
వ్యవసాయం అంటే దండగ కాదు.. పండుగ అని నిరూపించామన్నారు. సీఆర్‌కు ఒక్కటే చెబుతున్నా.. గెలిస్తే అధికారం చలాయిస్తాం.. ఓడిపోతే ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతామనే విధానం సరికాదు అన్నారు. గెలిస్తే పొంగిపోతారు.. ఓడిపోతే కుంగిపోతారా..? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఏం చేసినా వద్దనడం తప్ప వాళ్లకు ఇంకోటి తెలుస్తలేదని తీవ్రంగా మండి పడ్డారు.. గ్రూప్ 1 పరీక్షలు వద్దనడం, డీఎస్సీ వద్దనడం తెలంగాణకు మంచిదా? సీఎం ప్రశ్నించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసమా? మీ నలుగురు కుటుంబ సభ్యుల కోసమా? ఆత్మ పరిశీలన చేసుకో కేసీఆర్.. అని సీఎం రేవంత్ అన్నారు.
స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదన్నారు. నల్గొండ గడ్డపై నుంచి ఈ విషయాన్ని నేను గర్వాంగా చెబుతున్నా.. ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించి శాఖలవారీగా లెక్కలు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం.. అన్నారు. నడ్డా గారు.. మీరు మా అడ్డా కు వచ్చి అడ్డగోలుగామాట్లాడకండి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మోదీ.. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఒక్క ఏడాదిలో 55,143 ఉద్యోగాలు భర్తీ చేశారా? అని ప్రశ్నించారు. నిరూపిస్తే ఢిల్లీ నడిబజారులో తలవంచుకుని మీకు క్షమాపణ చెబుతా.. లేకపోతే మీరు మా రాష్ట్రాన్ని అభినందించండన్నారు.
కేటీఆర్ , హారీశ్ మాటలనే కిషన్ రెడ్డి, ఈటెల కాపీ కొడుతున్నారన్నారు. దొంగల సోపతి పట్టి దొంగల బండి ఎక్కోద్దు.. దొంగల బండిలో చేరితే మీకున్న గౌరవం తగ్గుతుందని ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, మోదీకి నల్లగొండ వేదికగా సవాల్ విసురుతున్న.. ఏడాదిలో 21వెల కోట్లు విడుదల చేసి రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మాది.. దేశంలో ఎక్కడైనా ఇలాంటి చరిత్ర ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2,400 కోట్లు ఒక్క నల్లగొండ జిల్లాలో రుణమాఫీ జరిగిందన్నారు. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యా వ్యవస్థలో సమూల మార్పు తీసుకొచ్చి విద్యార్థులను మన ప్రభుత్వం ఆదుకున్నది నిజం కాదా.. అంటూ ప్రశ్నల వర్షం కురుపించారు.
.అపార అనుభవం ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన ఆయన ఓ గాలి బ్యాచ్‌ను తయారు చేశారని విమర్శించారు. వాళ్లకి అభివృద్ధిని అడ్డుకోవడం తప్పా మరోపని లేదని మండిపడ్డారు. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామని ఆయన హామీ ఇచ్చారు.