మరో ముగ్గురికి సైతం తాఖీదులు
16న విచారణకు హాజరుకావాలని ఆదేశం..
సర్వత్రా హాట్‌టాపిక్
భూదాన్ భూముల స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమోద డెవలపర్స్‌కి చెందిన సూర్య తేజతో పాటు కేఎస్‌ఆర్ మైన్స్‌కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్‌లో లాభపడినట్లు ఈడీ గుర్తించింది. ఈ స్కామ్‌లో ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమార్‌ను ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు. తాజాగా నలుగురికి నోటీసులు జారీ చేశారు. వీరందరూ ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులో తెలిపింది. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదీ విషయం…
కాగా.. నాగరంలోని సర్వే నంబర్ 181, 182లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డ్‌కు చెందినదని బోర్డ్ వాదిస్తోంది. అయితే ఈ భూమి జబ్బర్దస్తూ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. తర్వాత కాలంలో జబ్బర్దస్తూ ఖాన్ కొడుకు హజీ ఖాన్ ఈ 50 ఎకరాలు ల్యాండ్‌ను భూదాన్ బోర్డ్‌కు దానం చేశారు. అయితే 2021లో హజీఖాన్ వారుసరాలిని అంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా అనే మహిళ దరఖాస్తు చేసింది. దీంతో ఆగమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో , తహసీల్దార్, ఆర్‌ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఆమెకు అనుకూలంగా పని చేసినట్లు విచారణలో బయటపడింది.
రియల్ ఎస్టేట్ కంపెనీకి విక్రయాలు..
అనంతరం ఈ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మకాలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ భూమికి సంబంధించి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ భూమిపై క్రయవిక్రయాలు జరగకుండా ధరణిలో నిషేధిత జాబితాలో అధికారులు పెట్టారు. ఈ వ్యవహరం కోర్ట్‌కు చేరడంతో న్యాయస్థానం ఆదేశాలతో అప్పటి ఎమ్మార్వో జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టార్, ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్∙యజమాని కొండపల్లి శ్రీధర్‌పై కేసు నమోదైంది. రెండు కేసులో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరగడంతో ఈడీ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ విచారణ కొనసాగుతోంది.
50 ఎకరాలు అన్యాక్రాంతం..
కాగా.. 50 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతం అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ విచారణలో భూదాన్ భూముల భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇదే వ్యవహారంలో అప్పటి ఎమ్మార్వో జ్యోతిపై కేసు నమోదు అయిన సంగతి విధితమే. జ్యోతిపై కేసు నమోదైన తర్వాత విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరిపింది. ఈ క్రమంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ ఉండటంతో ఆయనకు నోటీసు జారీ చేసిన ఈడీ.. శుక్రవారం విచారణ చేపట్టింది. భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఐఏఎస్‌కు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ పనిచేశారు.