వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య ఇప్పుడు పొలిటికల్ చౌరస్తాలో నిల్చొన్నారు. దశాబ్దాలుగా బీసీల కోసం ఉద్యమించిన తాను.. మళ్లీ బీసీల హక్కుల కోసం పోరాడతానని ప్రకటించారు. కానీ, ఆయన ప్రకటనలపై ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు.. బీసీ పోరాటల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణయ్యను తెలంగాణ రాజకీయాల్లో వాడుకోవాలని రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయట… కేంద్రంలో పదవి ఇస్తామని ఓ పార్టీ.. రాష్ట్రంలో చూసుకుంటామని మరో పార్టీ ఆయన వెంట పడుతున్నాయని చెబుతున్నారు.. ఇంతకీ బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఆలోచనలేంటి? ఆయన పొలిటికల్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది….?
కృష్ణయ్య కోసం ఆ రెండు ప్రధాన పార్టీల ప్రయత్నాలు..
బీసీ ఉద్యమనేత ఆర్.కృష్ణయ్య పొలిటికల్ ఫ్యూచర్‌పై తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది. బీసీ ఉద్యమం అంటేనే గుర్తుకొచ్చే ఆర్.కృష్ణయ్య గత పదేళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. తెలంగాణల్లో ప్రభావవంతమైన బీసీ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఆర్.కృష్ణయ్య కోసం ఎప్పుడూ డోర్స్ ఓపెన్ చేసి ఉంచుతున్నాయి.
ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్.. ఆర్.కృష్ణయ్యను తమ పార్టీలో చేరమంటే తమ పార్టీలో చేరమని ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. నిన్నటివరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆర్.కృష్ణయ్య అకస్మాత్తుగా తన ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. బీసీ ఉద్యమ నేతగా తెలంగాణలో ఆయనకు గణనీయమైన అనుచరగణం ఉండటంతో ప్రధాన పార్టీలు రెండూ కృష్ణయ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.