బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ మంత్రిగా ఉండగా అధికార దుర్వినియోగానికి, నిధుల గోల్ మాల్ కి పాల్పడ్డారనే అంశంపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో.. కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదన్న కేటీఆర్ అవసరమైతే రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టాలనే డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లేఖ రాశాను అన్ని తెలిపారు.
కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన ఫార్ములా కార్ రేస్ లో నిధుల్ని ఇష్టారాజ్యంగా విడుదల చేశారని ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఈ కార్ రేస్ వల్ల నగర ప్రతిష్ట పెరిగిందని కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసును హైదరాబాద్ కు తెచ్చేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఎల్ ఆటోమొబైల్- FIA కింద ఫార్ములా రేసులు జరుగుతాయని తెలిపిన కేటీఆర్.. చంద్రబాబు హాయాంలోనే ఫార్ములా రేసు కోసం ప్రయత్నించారని వెల్లడించారు. కానీ.. అప్పుడు సాధ్యం కాలేదని తమ హయాంలో రేస్ ని నిర్వహించామన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఫార్ములా-ఈ నిర్వహకులను రేస్ నిర్వహించాల్సిందిగా కోరామన్న కేటీఆర్.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు భాగ్యనగరాన్ని కేరాఫ్ అడ్రెస్ గా మార్చాలని ప్రయత్నించినట్లు తెలిపారు. మొదటిల్లో ఫార్ములా -ఈ వాళ్లు రాలేమన్నారని, కానీ.. వాళ్లను ఒప్పించి తీసుకువచ్చేంచామని చెప్పుకొచ్చారు. అలా వారితో 2022 లో తొలి ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భాగంగా గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏస్ జెన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున నాలుగేళ్లు రేస్ నిర్వహించేలా ఒప్పందం కుదిరిందని తెలిపిన కేటీఆర్.. జూన్‌లో ప్రమోటర్ వెళ్లిపోయారని ప్రస్తుతం కేసులో ఏ2 గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తన వద్దకు వచ్చారని వివరించారు. ఎలాగైనా నగరంలో కార్ రేస్ నిర్వహించాలనే ఉద్దేశ్యంతోనే రూ.55 కోట్లు చెల్లించినట్లు చెప్పుకొచ్చారు. అలా రెండు విడతల్లో రూ.55 కోట్లు చెల్లించినట్లు అంగీకరించారు.
తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారం మారిపోయిందని.. దాంతో గతేడాది డిసెంబర్ లో ఫార్ములా -ఈ ప్రమోటర్ సీఎం రేవంత్‌ను కలిశాడని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో ఈ డిసెంబర్ నిర్వహించాల్సిన రేస్ ఆగిపోయిందన్న కేటీఆర్.. నాలుగు రోజుల్లో మూడో విడత డబ్బు కట్టని కారణంగా.. ఫార్ములా -ఈ వాళ్లు అగ్రిమెంట్ రద్దు చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు.. FIA నుంచి డబ్బులు కూడా వెనక్కి వచ్చాయని తెలిపిన కేటీఆర్.. ప్రభుత్వం ఆ డబ్బును తీసుకోలేదని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏసీబీ కేసు ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. కేసు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చన్న కేటీఆర్.. ఎలాంటి పరిస్థితి నైనా శాంతియుతంగానే ఎదుర్కొంటామన్నారు.