కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి స్పెషల్ కోర్టు మంజూరు చేసింది. నరేందర్ రెడ్డి సహా 24 మంది రైతులకు బెయిల్ లభించింది. పట్నం నరేందర్ రెడ్డికి రూ. 50 వేల పూచీకత్తుపై, మిగతా వారికి రూ. 20 వేల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది కోర్టు.
నవంబర్ 13వ తేదీన ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి ఘటనపై ఆ రోజు అర్ధరాత్రి నుంచే పోలీస్ యాక్షన్ షురూ అయింది. అర్ధరాత్రి వేళ.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేసి.. సుమారు 300 మంది పోలీసులు 55 మందిని పట్టుకొని బంధించారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం 24 మంది రైతులకు కోర్టుకు రిమాండ్ చేశారు. వారందరినీ జైలుకు తరలించారు.