– ఏడుగురిపై కేసు నమోదు
– మెదక్ జిల్లా కాట్రియాలలో ఘటన
మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన డ్యాగల ముత్తవ్వ (48)ను గురువారం రాత్రి దారుణంగా హతమార్చారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముత్తవ్వ మంత్రాలు చేస్తుండడంతోనే కొంతకాలంగా తాము తరచూ అనారోగ్యం పాలవుతున్నామని ఆమె ఇంటి సమీపంలోనే ఉంటున్న పాలివారు కక్ష పెంచుకున్నారు. గ్రామంలో గురువారం సాయంత్రం దుర్గామాత ఉత్సవాల్లో తన భర్తతో కలిసి ముత్తవ్వ పాల్గొన్నారు. రాత్రి తిరిగి తన ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో ఆమె భర్త బాలయ్య ఉత్సవాల దగ్గరే ఉన్నారు. ముందస్తు పథకం ప్రకారం అప్పటికే ముత్తవ్వ ఇంటి సమీపంలో కాపుకాశారు. ఆమెను ఇంటిలో నుంచి బయటకు లాక్కొచ్చి విచక్షణా రహితంగా కర్రతో దాడి చేశారు. ఆపై ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
ముత్తవ్వ కుమారుడు 100కు సమాచారం అందజేశాడు. తీవ్ర గాయాలతో ఒళ్లంతా కాలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్న ముత్తవ్వను సంఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ముత్తవ్వ గురువారం అర్థరాత్రి మృతి చెందింది. మృతిరాలికి కూతురితో పాటు కుమారుడు ఉన్నారు. వీరికి పెళ్లిలు జరిపించారు. ఈ కేసులో గ్రామానికి చెందిన డ్యాగల రామస్వామి, మురళి, శేఖర్, లక్ష్మి, రాజ్యలత, మహాలక్ష్మి, పోచమ్మపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్‌రాజాగౌడ్ తెలిపారు. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సంఘటనాస్థలిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
కొడుకు కళ్లెదుటే..
మంత్రాల నెపంతో ముత్తవ్వపై దాడి చేసిన నిందితులు, కుమారుడు రవి చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. కన్నతల్లి మంటల్లో కాలిపోతుండగా విలవిలలాడాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించగా నిందితులు బెదిరించి నెట్టివేశారు. నిస్సహాయ స్థితిలో బాధను గుండెల్లో దిగమింగుకొని కన్నీటి పర్వంతమయ్యాడు.