సినీ నటుడు అల్లు అర్జున్ నివాసానికి ఓయూ జేఏసీ పేరిట కొందరు విద్యార్థులు వెళ్లి నిరసన వ్యక్తం చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటికి ఆదివారం సాయంత్రం కొందదరు వ్యక్తులు వెళ్లి రేవతి మృతికి సినీ నటుడు బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇంటి ప్రాంగణంలోని పూల కుండీలను పగలగొట్టడంతో పాటు, ఇంటిపైకి టమోటాలు, రాళ్లు విసిరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.