ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
(అమ్మన్యూస్, హైదరాబాద్):
కదులుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వివాహితపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 18న కూకట్పల్లికి చెందిన ఓ మహిళ ప్రయాణికురాలు విజయవాడ వెళ్లేందుకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కింది. ఈ క్రమంలో బస్సు సిబ్బందిలో ఒకరు ఆమెకు కూర్చునేందుకు సీటును కూడా చూపించాడు. అయితే, చౌటుప్పల్ శివారు ప్రాంతంలోకి రాగానే ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే, విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించడంతో ఆ వివాహిత సైలెంట్‌గా ఉండిపోయింది. కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పేసింది. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసిన చౌటుప్పల్ పోలీసులు కేసును కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా, అత్యాచారం చేసే సమయంలో బస్సులో ఇతర ప్రయాణికులు లేరా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు కూకట్‌పల్లి పోలీసులు ఈ నెల 18న ఆ బస్సులో ఉన్న డ్రైవర్, క్లీనర్ ఎవరు విధుల్లో ఉన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.