ఆస్కార్ విజేత సంగీత స్వరకర్త, గాయకుడు ఏఆర్ రెహమాన్ గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఇది అతని అభిమానులను షాక్‌కు గురి చేసింది. 2 దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను నుండి విడిపోతున్నారు. తన వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు, తన భర్త నుండి విడిపోతున్నట్లు AR రెహమాన్ భార్య సైరా బాను ప్రకటించింది.
రెండు దశాబ్దాలకు పైగా వివాహం చేసుకున్న ఈ జంట ఈ నిర్ణయం వెనుక గల కారణాల గురించి ఇంకా ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు. అయితే, ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించి సైరా లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు సైరా తెలిపింది. ఈ కష్టకాలంలో తన పైవసీని గౌరవించాలని ప్రజల్ని కోరింది సైరా భాను.
“పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత, సైరా తన భర్త ఏఆర్ రెహమాన్ నుండి విడిపోవాలని కఠినమైన నిర్ణయం తీసుకుంది. వారి సంబంధంలో ముఖ్యమైన భావోద్వేగ ఒత్తిడి తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకరికొకరు గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఈ జంట ఉద్రిక్తతలు, ఇబ్బందులు తమ మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయి. ఈ సమయంలో అంశం కూడా వారధి చేయలేకపోయింది. సైరా బాను బాధతోపాటు మనోవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లాయర్ వందనా షా ఉద్ఘాటించారు. సైరా బాను తన జీవితంలోని ఈ కష్టమైన అధ్యాయాన్ని నావిగేట్ చేస్తున్నందున, ఈ సవాలు సమయంలో ప్రజల నుండి గోప్యత, అవగాహనను అభ్యర్థిస్తుంది” అని ప్రకటనలో పేర్కొన్నారు సైరా బాను తరఫు న్యాయవాది వందనా.
ఏఆర్ రెహమాన్ 1995లో సైరా బానుని పెళ్లి చేసుకున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. సైరాతో తన తల్లి తన పెళ్లిని ఫిక్స్ చేసిందని సిమి గరేవాల్ చాట్ షోలో ఏఆర్ రెహమాన్ వెల్లడించారు. తనకు కూడా వధువు దొరకడం లేదని, అందుకే తన తల్లికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఏఆర్ రెహమాన్, సైరా బాను వివాహమై 29 ఏళ్లు. వీరిద్దరికీ ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.