నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీరానికి చేరేసరికి బలహీనపడవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో రాబోయే నాలుగు రోజుల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దక్షిణ మధ్య బంగాళాఖాతం పై సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం నేడు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో దక్షిణ కోస్తా, రాయలసీమలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడి వర్షం పడనుందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే, గత వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతల్నించి ఉపశమనం కలగనుంది. అదే సమయంలో రాత్రి చలి మరి కాస్త పెరగవచ్చు. ఇప్పటికే తెలంగాణలో రాత్రి వేళ చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వర్షాలు పడితే చలి తీవ్రత మరింత పెరగవచ్చు.