అమెరికాలో ప్రకటించిన సీఎం
రెండు రోజుల్లో బాధ్యతల స్వీకరణ
అమ్మన్యూస్, హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎంపికయ్యారు. రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పీపీపీ మోడల్ లో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికి చైర్మన్ గా ఉండాలని ఆనంద్ మహీంద్రాను తాను రిక్వెస్ట్ చేశానని, రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. ప్రపంచంలో నైపుణ్యానికి చాలా డిమాండ్ ఉందని, అందుకే తెలంగాణలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో ఐటీ, వైద్య, క్రీడా రంగాలతో పాటు పలు అంశలపై శిక్షణనిస్తామని తెలిపారు.
57 ఎకరాల్లో..
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేశారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీ నిర్మించనున్నారు. వర్సిటీ కోసం మొత్తం 57 ఎకరాల స్థలం కేటాయించారు. రూ.100 కోట్ల నిధులను విడుదల చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇక్కడి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం17 కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏడాదికి సగటున రూ.50 వేల ఫీజు ఉంటుందని సమాచారం. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా సమావేశమయ్యారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీని పరిశీలించేందుకు తన టీమ్‌ను పంపుతానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.