పాలిటిక్స్ లో హత్యా రాజకీయాలు ఉండకూడదని దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య కేసు గురించి అడుగుతున్నారని చెప్పారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తాను చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ సరిగ్గా విచారణ జరపాలని… కానీ, ఆ పని చేయడం లేదని, వారిపై ఏ ప్రెజర్ ఉందో తనకు తెలియదని చెప్పారు. ట్రయల్ జరిగితేనే హంతకులకు శిక్ష పడుతుందని తెలిపారు. అవినాశ్, భాస్కర్ రెడ్డిలు తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని శిక్షించాలని అన్నారు.
కర్నూలులో అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లి, అరెస్ట్ చేయకుండా సీబీఐ అధికారులు వెనక్కి వచ్చారని… ఎవరినైనా అరెస్ట్ చేయకుండా సీబీఐ వెనక్కి రావడం ఎప్పుడైనా జరిగిందా? అని సునీత ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. వీళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని… వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దని సునీత పిలుపునిచ్చారు.