మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల ఇళ్ల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు డిమాండ్ చేశారు. బర్కత్‌పురాలోని నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లు కూల్చివేస్తామని మార్కింగ్ చేస్తుండటంతో నిరుపేదలు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారని అన్నారు. ఇళ్ల కూల్చివేతపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అన్ని రాజకీయ పార్టీల సూచనలను సలహాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మూసీసుందరీకరణపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి రూట్ మ్యాప్‌నూ ప్రకటించలేదని విధివిధానాలను రూపొందించలేదని దీనివల్ల ప్రజలు తీవ్రభయాందోళన కు గురవుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్ల కూల్చివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని, పేదలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లు కూల్చితే బీజేపీ ఉద్యమిస్తుందని బాధితులకు అండగా నిలస్తుందని ఆయన స్పష్టం చేశారు.