రాష్ట్రంలో మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా యువత ముందుకు వెళ్లాలని రేగా పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని.. యువనేతలకు దిశానిర్దేశం చేశారు. పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని.. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఎప్పుడో ఖాయమైందని తెలిపారు. భవిష్యత్ రాజకీయాలలో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. వివిధ రంగాలలో ఉన్న యువతను ఒకే తాటిపైకి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పట్టుదలతో పని చేయాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. ఎన్నికల సమయం ఆసన్నమైందని.. ఎన్నికలను ప్రతిష్మాత్మకంగా తీసుకోవాలని.. కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.