125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న కేసీఆర్
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సమీపంలో తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకకు వేళైంది. అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ సమాజంతోపాటు యావత్తు దేశ ప్రజలు సంబురపడేలా విగ్రహావిష్కరణ ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. ఇప్పటికే 125 అడుగుల ఎత్తులో నిర్మించిన అంబేదర్ మహా విగ్రహాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించనున్నారు. ఆవిషరణ సభకు ఉన్నతస్థాయిలో ఏర్పాట్లు చేశారు. అంబేదర్ స్మృతివనం ప్రాంగణంలోనే దాదాపు 40 వేల మందికి కుర్చీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎంపిక చేసిన ఆహ్వానితులు, మేధావులు, ప్రముఖులకు ఉత్సవ కమిటీ ఆహ్వాన పత్రికలను అందజేసింది.
విగ్రహావిష్కరణ కార్యక్రమ వివరాలు
సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.30 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొంటారు.
ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తూ అంబేద్కర్‌కు ఘనంగా పుష్పాంజలి ఘటిస్తారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభం అవుతుంది. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేదర్ ప్రసంగిస్తారు.
అనంతరం జయంతి వేడుకలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ సందేశం ఇస్తారు.
సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ధన్యవాద ప్రసంగంతో సాయంత్రం 5 గంటలకు సభ ముగుస్తుంది.