అంబేడ్కర్ విగ్రహంతో తెలంగాణ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరగనున్నాయి. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం.. మరోవైపు తెలంగాణ అమరుల స్మారకచిహ్నం.. అక్కడే ఏర్పాటు చేసిన అంబేడ్కర్ భారీ విగ్రహం హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారనున్నాయి. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా.. ‘125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామ’ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం… యావత్ దేశమే అబ్బురపడే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. డాక్టర్ బీఆర్ అంబేదర్ జయంతిని పురసరించుకొని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేసిన అంబేదర్ భారీ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
ఎడమ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని, కుడిచేయి చాచి చూపుడు వేలుతో గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ మహా నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నది. హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తయినది.
మహారాష్ట్ర, ధూలె జిల్లాలోని గోండూరు గ్రామానికి చెందిన స్థపతి రాంజీ సుతార్ అనే 98 ఏండ్ల వయసున్న విశ్వకర్మే చేతిలో ఈ అంబేడ్కర్ విగ్రహం రూపొందించబడింది. రాంజీ సుతార్, ఆయన తనయుడు అనిల్ సుతార్ డిజైన్ చేశారు. 45 అడుగుల వెడల్పుతో 50 అడుగుల ఎత్తులో పార్లమెంట్‌ను పోలిన పీఠం నిర్మించి, దానిపై 125 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టారు. దీంతో అంబేద్కర్ విగ్రహం మొత్తం ఎత్తు 175 అడుగులతో అత్యంత ఎత్తుగా కనిపిస్తున్నది. ఈ విగ్రహ నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. 425 మంది సిబ్బంది ఈ విగ్రహ నిర్మాణం పనుల్లో భాగస్వామ్యమయ్యారు. విగ్రహానికి పాలీయురేథీన్‌తో పాలిషింగ్ చేస్తున్నారు. రూ.146 కోట్ల 50 లక్షలు వెచ్చించి అవసరమైన అన్ని నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.